భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలో ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు డచ్‌బంగ్లా హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా శ్రీకూర్మ క్షేత్రానికి చేరుకుని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని, వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందుకున్నారు. ఇంద్ర పుష్కరణిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు.
పర్యటనలో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడికుదుటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు తదితరులు ఉపరాష్ట్రపతిని కలుసుకున్నారు. ఆలయాల దర్శనం అనంతరం, ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా సంభాషించారు.
మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఉపరాష్ట్రపతి, సుమారు గంటన్నర పాటు అక్కడి గడిపారు. అనంతరం హెలికాప్టర్లో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఉపరాష్ట్రపతి పర్యటన ప్రశాంతంగా ముగిసింది.











