నేడు రైతు రుణమాఫీ కై తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
మధ్దెపురం రాజు సిపిఎం మండల కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :
రైతులందరికీ ఆగస్టు15 లోపు ₹2లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నెరవేరలేదని దీనికి నిరసనగా రేపు గుండాల మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని సిపిఎం గుండాల మండల కార్యదర్శి మధ్దెపురం రాజు తెలిపారు.బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డు,ఆధార్ కార్డు,పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన సాంకేతిక లోపాల వల్ల రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులు రైతువేదిక చుట్టూ తిరుగుతూ అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అప్పులు ఉన్న రైతుల సంఖ్య 70 లక్షలు ఉంటే ఇప్పటి వరకు రుణమాఫీ అయినది కేవలం 20 లక్షల మందికి మాత్రమే కాగా రైతుల రుణాల మొత్తం 49 వేల ఐదు వందల కోట్లు అవసరం ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి 40,000 కోట్లు అవసరం అని తెలిపి తరువాత 31 వేల కోట్లు ఫైనల్ చేసి రుణమాఫీకి 26 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి చివరికి మాఫీ చేసింది మాత్రం 17093 కోట్లు మాత్రమే అని వివరించారు.దీన్నిబట్టి చూస్తే రుణమాఫీ వ్యవహారం మూడు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే విధంగా ఉందని విమర్శించారు.రుణమాఫీ కానీ రైతుల గందరగోళానికి తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.రుణమాఫీ కానీ రైతులంతా రేపు గుండాల మండల తహాశీల్దారు కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఆయన వెంట సిపిఎం మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ, యండి ఖలీల్,బత్తిని బిక్షం పాల్గొన్నారు.