Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ ను సందర్శించిన అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్

IMG 20240829 WA0428 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ ను సందర్శించిన అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆనంద్ పవర్ 

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 29, కామారెడ్డి :

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ.ఆనంద్ పవర్ గురువారం సందర్శించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య మాట్లాడుతూ… అనేక అడ్డంకుల వల్ల రెగ్యులర్ గా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించని వారికి దూరవిద్య డిగ్రీ ఒక వరప్రదాయని అని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆనంద్ పవర్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యకు ఆర్థిక పరిమితులు అడ్డంకులు కాకుండా సబ్జెక్ట్ నిపుణులచే స్వీయ అభ్యసనకు అనుకూలమైన సామాగ్రిని అందిస్తున్నామని, పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వివిధ కోర్సులను కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికి విద్యను అందుబాటులోకి తీసుకొనిరావటం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని జిల్లా కేంద్రాలలోని అన్ని వనరులతో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులు, స్టడీ మెటీరియల్స్, ఉపన్యాసాలు ఆడియో విజువల్ పాఠాలు, యూట్యూబ్ ఛానల్స్, కమ్యూనిటీ రేడియో తదితర సాధనాలు ఉపయోగించి విద్యార్థులు సొంతంగా తేలికగా, వేగంగా నేర్చుకొనుటకు అందరికి అందుబాటులో విద్యను ఉంచుతున్నామని అన్నారు. ఔత్సాహిక విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించి జ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలని కోరారు.
కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. సుధాకర్ మాట్లాడుతూ 2024 -25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని విద్యార్థులు సదవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. సుధాకర్, అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ జి. శ్రీనివాసరావు, లక్ష్మణాచారి, డాక్టర్ రాజ్ గంభీరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, లక్ష్మణ్, అనిల్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version