పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు
*జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 14, కామారెడ్డి :
పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా
మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఇటీవల డెంగీ పాజిటివ్ వచ్చి కోలుకున్న బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. డెంగీ జ్వరం రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఇండ్ల ముందున్న డ్రమ్ములలో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచరాదని సూచించారు. మురుగు కాలువలు శుభ్రంగా ఉంచాలని, ఫాగింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శి విజయ ను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పై గ్రామీణులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పరిసరాల్లో వర్షపు నీరు నీలువకుండా చూడాలన్నారు. వర్షం నీరు నిలువ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని చెప్పారు.
*రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి* *జిల్లా కలెక్టర్*
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని హాజరు పట్టికను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదర్శ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎలాంటి రోగాలు వచ్చిన బాధితులు ఉన్నారని అరా తీశారు. జ్వరం, వాంతులు, విరేచనాలు ఉన్న బాధితులు ఉన్నారని వైద్యాధికారి తెలిపారు. రక్త పరీక్షల, ఇన్ పేషెంట్, మందుల, ఆపరేషన్ థియేటర్ గదులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, డిపిఓ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.