అక్రమంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించొద్దని, నిబంధనలకు వ్యతిరేకంగా బయటి వారికి లాగిన్ ఇచ్చి పని చేయించే పద్ధతులను విరమించుకోవాలని సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌కె చాన్‌బాషా పేర్కొన్నారు.
ఆయన ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ సభ్యులు ఇందుకూరుపేట ఉపాధి హామీ ఎపిఒ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాన్‌బాషా మాట్లాడుతూ మండలంలో 18మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు గ్రామాల్లో పని చేస్తున్నారని తెలిపారు. వారిలో కొంతమంది దాదాపుగా 10సంవత్సరాల నుండి పని చేస్తున్నారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ల నుండి ఎలాంటి సంజాయిషీలు అడగకుండా రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు వారిని తొలగించమని చెప్పడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను మార్చే విధానం మంచిది కాదన్నారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన పనులనే ప్రస్తుత అధికార పార్టీ వారు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉన్న ఉద్యోగాల్లో పని చేస్తున్న వారిని తొలగించి వారి మనుషులను పెట్టుకోవడం సరికాదన్నారు. అనధికారికంగా లాగిన్‌లు ఇచ్చిన వారి నుండి లాగిన్‌లు తొలగించి, మొదటి నుండి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లకు లాగిన్‌లు ఇచ్చి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసుకునే విధంగా చూడాలన్నారు. తొలగిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను తిరిగి తీసుకోవాలన్నారు. లేని పక్షంలో సిఐటియు ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు దయాసాగర్, ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకయ్యబాబు, గున్నం కిషోర్, పవన్, నొమ్ కుమార్, మహేశ్వరీ, సుబ్రమణ్యం, ప్రసాద్, రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు.