కుట్టు మిషన్ పంపిణీ – మహిళా సాధికారతకు మరో అడుగు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 18
తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ సెక్రెటరీ విక్రాంత్ సింగ్, చేతుల మీదుగా 30 మంది మహిళలకు మిషన్లు అందజేశారు. ఒక్కో మిషన్ ధర రూ.16,000 ఉండగా, 50 శాతం సబ్సిడీ కింద మహిళలు కేవలం రూ.7,300కే మిషన్‌ను పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మేనేజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ – గ్రామ స్వరాజ్య సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతోపాటు నైపుణ్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నామని, మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆమె మాట్లాడుతూ, “మహిళలు కేవలం కుట్టు శిక్షణలోనే కాకుండ, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణల్లోనూ ముందుకు రావాలి. ఈ శిక్షణలతో పాటు జాబ్ ప్లేస్‌మెంట్స్, లింకేజీ గ్రూపుల ద్వారా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది” అని పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్య సంస్థ తరఫున మరో 30 రోజుల పాటు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ విక్రాంత్ సింగ్, మండల ట్రైనర్ అనిత, ఐకేపీ వోఏలు, కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.