సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి: మహిళా–శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా సీనియర్ సిటిజెన్స్ వాగ్దాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రతిజ్ఞ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు మన సమాజపు అమూల్యమైన సంపద అని, వారి అనుభవం, జీవన జ్ఞానం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని అన్నారు. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నప్పటికీ, వారు ఎదుర్కొంటున్న కుటుంబ, ఆస్తి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థల మార్పులతో వృద్ధులపై నిర్లక్ష్యం, ఒంటరితనం పెరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు, పెన్షన్ పథకాలు, ఆస్తి రక్షణ యాజమాన్యాలు, వృద్ధాశ్రమాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ–సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు. వృద్ధులపై ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళా–శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కే.లలిత కుమారి మాట్లాడుతూ.. వృద్ధులపై మానసిక లేదా శారీరక వేధింపులు జరిగితే టోల్‌ఫ్రీ నంబర్ 14567కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను శాఖ స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య అధికారి డా.వసంత్ రావు, డాక్టర్ నాగ నిర్మల, మదర్ అండ్ చైల్డ్ కేర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్, యూత్ & స్పోర్ట్స్ వెల్ఫేర్ అధికారి కాసిం బేగ్, డి.ఆర్.డి.ఓ–పెన్షన్ విభాగం షహవర్ బేగం, బాలల సంరక్షణ అధికారి రత్నం, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్, మహిళా సాధికారత సమన్వయకర్త పల్లవి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఉమెరా సహిష్ట తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులు సమాజానికి మార్గదర్శకులు: జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: November 15, 2025 4:06 pm