నూతన విత్తన చట్టం ముసాయిదాపై లబ్ధిదారుల అభిప్రాయ సేకరణ: జిల్లా వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో నూతన విత్తన చట్టం–2025 ముసాయిదా పై అవగాహన, అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విత్తన చట్టం–2025 ద్వారా దేశ వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, నర్సరీ మొక్కలు అందుబాటులోకి తేవడం, నకిలీ విత్తనాల నియంత్రణ, విత్తనాల దిగుమతుల సరళీకరణ, అలాగే రైతుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. విత్తన నాణ్యతపైన నియంత్రణ, వాణిజ్య సరళీకరణ, అలాగే ఉల్లంఘనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో పలు నిబంధనలు చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించే ముందు రైతులు, లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు వంటి ప్రయోజనకారుల అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత చట్టంలో పది అధ్యాయాలు, 48 విభాగాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన విత్తన రకాలపైనే నియంత్రణ అధికారాలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం బసంతపూర్ (చెరుకు) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కె.రాహుల్ విశ్వకర్మ, తెలంగాణ మంజీర రైతు సమైక్య టి.పృథ్వీరాజ్, తెలంగాణ రైతు రక్షణ సమితి కే.రాఘవేందర్ రెడ్డి, సీడ్ సర్టిఫికేషన్ విభాగం ఫస్ట్ అండ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, హార్టికల్చర్ అధికారి టీస్ స్పందన, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment