*వడదెబ్బ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచన*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 3
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాలలో నేరుగా సూర్యకిరణాలు తాకే ప్రదేశాలలో పనిచేసేవారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ హితవు పలికారు. మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గుడ్డ చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు మానుకోవాలని, చల్లని ప్రదేశాల్లో లేదా నీడలో ఉండాలని ఆయన అన్నారు.
వేసవిలో సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకోవాలని, పలుచని కాటన్ దుస్తులు ధరించాలని కలెక్టర్ సూచించారు. వృద్ధులు, చిన్నారులు, త్వరగా వడదెబ్బకు గురయ్యే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వడదెబ్బకు గురి కాకుండా యాజమాన్యాలు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థం కూడళ్ల వద్ద, పార్కుల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసి త్రాగునీరు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ) ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలచే ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆయన తెలిపారు. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే మంచి నీరు లేదా ఓఆర్ఎస్ కలిపిన నీరు త్రాగించాలని, వారిని నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలని సూచించారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీడ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మూగజీవాలకు, పక్షులకు కూడా నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు.