ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
టేకులపల్లి మండలంలోని సులనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు,మౌలిక సదుపాయాలు, ఔషధాల లభ్యత,పరిశుభ్రత, సిబ్బంది హాజరు,రోగుల రిజిస్టర్లు, డాక్టర్ల హాజరు పత్రాలు,ల్యాబ్ మరియు ఔషధ నిల్వల రికార్డులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ వైద్య కేంద్రాలపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యతతో పాటు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానిక కావలసిన పరికరాలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదికల సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ముత్యాలంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.పాఠశాలలో విద్యా ప్రమాణాలు,మౌలిక వసతులు, శుభ్రత, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు.విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారి పాఠ్య పుస్తకాలు,నోట్‌బుకులు పరిశీలించి,వారికి తెలుగు భాషలో రాయడం,చదవడం ఎంతవరకు వచ్చునో ప్రత్యక్షంగా పరీక్షించారు.విద్యార్థుల చేతిరాతను పరిశీలిస్తూ వారితో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు,భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ, విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తి పెంచేలా బోధన సాగాలని కలెక్టర్ గారు తెలిపారు. ప్రతి ఒక్కరికీ చదవడం,రాయడం,అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు కలిగేలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే విధంగా తరచూ అధ్యయనం కొనసాగించాలని అన్నారు.అదే విధంగా పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,తాగునీటి సదుపాయం,విద్యుత్, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులను ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండటం పాఠశాల తరగతులు సరిపోవడంలేదని పరిశీలించిన కలెక్టర్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
