ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు వసతి గృహాలలో ప్రతి విద్యార్థులకు మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమధ్యం నివారించవచ్చు, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. విద్యాశాఖ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసి జిల్లాలోని విద్యార్థులందరికీ మాత్రలను అందివ్వాలి అన్నారు. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు మాత్రలు అందించాలన్నారు. అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి వయసుల వారీగా మాత్రల డోస్ ఇవ్వాలన్నారు. భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. మాత్రలు వేసే ప్రదేశంలో తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
జిల్లాలో 336,212 మంది ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారని ఆయన తెలిపారు. వారి అందరికీ మాత్రలు అందించాలని తెలిపారు. ప్రత్యేక షెడ్యూల్ ని ఏర్పరచుకొని నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందివ్వాలి అన్నారు. ప్రజలకు అర్బెండజోల్ మాత్రల ఉపయోగాలపై కళా జాతర బృందాలు మరియు మహిళా సమాఖ్యల ద్వారా విస్తృత అవగాహన కల్పించి, పిల్లలందరూ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. 10వ తేదీన మాత్రలు తీసుకొని వారికి 17వ తేదీన మాప్ ఆఫ్ డే నిర్వహించి మాత్రలు అందించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని విద్యార్థులకు మాత్రలు అందేలా చూడాలని, అనంతరం నివేదికలు సమర్పించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నులిపురుగుల నిర్మూలలకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, డిసిహెచ్ఓ రవిబాబు, మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి అనసూయ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
