డిసెంబర్ 31 లోపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
– ప్రతి గ్రామానికి / మున్సిపల్ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి
– ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ద్వారా వివరాల సేకరణ
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, డిసెంబర్-12
డిసెంబర్ 31 లోపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్లు జే.అరుణ శ్రీ, డి.వేణు లతో కలిసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి స్థితిగతులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగిస్తూ సర్వే ప్రక్రియ డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించుకుని సర్వే చేపట్టాలని, ప్రతి గ్రామానికి/ మున్సిపల్ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఆయన ద్వారా ఇందిరమ్మ యాప్ లో లాగిన్ అయ్యి వివరాలను పక్కగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించాలని, సర్వే జరిగే సమయంలో ప్రజలు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ గురించి ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.