Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251229 192939

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించి కీలక సూచనలు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం లైన్ డిపార్ట్ మెంట్స్ కు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలన్నారు. జనవరి 01వ తేదీ నుండి చేపట్టనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. అవి ప్రజలకు చేరేవిధంగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించబడిన ప్రదేశాలలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా రూపొందించాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన పరిహారమందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2023 నుండి 2025 వరకు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ లు, క్షతగాత్రులు, చనిపోయిన వారు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో నమోదైన కేసులు తదితర వివరాలను ఆయన వెల్లడించారు. 2026లో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో తగ్గించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, రెవిన్యూ డివిజినల్ అధికారులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్, ఆర్టీసీ, శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version