Site icon PRASHNA AYUDHAM

గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి ‘పోషణ అభియాన్: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251016 203139

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి ‘పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. గురువారం పటాన్‌చెరులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితకుమారి, సీడీపీఓ జయరాం నాయక్, స్థానిక కార్పొరేటర్లు కుమార్ యాదవ్, పుష్ప నాగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా జరుపుకుంటూ, నెల రోజుల పాటు జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పౌష్టికాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని, గత నెలలో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని తెలిపారు. ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు కొలతలు ఖచ్చితంగా నమోదు చేసి రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసిన పిల్లలను దగ్గరలోని పిహెచ్ సి కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించాలని, అంగన్వాడీ సిబ్బంది, వైద్యుల సమన్వయంతో శ్యామ్ పిల్లల (పోషకాహార లోపం ఉన్న పిల్లల) సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని, మంచి పోషకాహారం అందించడం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల బాధ్యత అని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ…పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుందని, భారతదేశం యువశక్తితో నిండిన దేశం.ల్ అని, భావి భారత పౌరులు ఆరోగ్యవంతంగా ఎదగాలంటే అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న పోషణ కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం అవసరం అన్నారు. మన పెరటి తోటల్లో లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు వంటి స్థానిక ఆహార పదార్థాలు వాడటం ద్వారా అనేక పోషక లోపాలను నివారించవచ్చని, అంగన్వాడీ సిబ్బంది, ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కల్పించాలి అని సూచించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర మరువలేనిదని, ఇంటింటికీ వెళ్లి గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించడం అభినందనీయం అన్నారు. పోషణ మాసం ముగింపు సందర్భంగా 300 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, 50 మంది పిల్లలకు అక్షరాభ్యాసం, 50 మంది పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీడీపీఓలు చంద్రకళ, ప్రియాంక, సుశీల, మధులిక, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు

Exit mobile version