సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి, అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కన్వీనర్‌గా జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ తుల్జా నాయక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 24లక్షల సబ్సిడీకి డిపిసి ఆమోదం తెలిపిందని తెలిపారు. ఈ వర్గాల యువత పరిశ్రమల స్థాపనలో ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రా మెటీరియల్స్ సరఫరా, భూకమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర అనుమతులపై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి, పూర్తి అయిన ఫైళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ తుల్జా నాయక్ మాట్లాడుతూ.. టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేసే ప్రక్రియను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), హెచ్‌ఎండిఏ, డిటిసిపి, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, ఎక్సైజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288