సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. 2025–26 సీజన్‌లో పత్తి, ధాన్యం తదితర పంటల కొనుగోళ్లను పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత శాఖలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2025–26 సీజన్ పత్తి సాగు, దిగుబడిపై సమగ్ర అంచనా ప్రకారం, పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మార్కెటింగ్ యార్డుల పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల నుండి సీసీఐ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. పత్తి అమ్మకానికి ఆధార్ ప్రామాణికత తప్పని సరి అని, చెల్లింపులు రైతుల ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి యంత్రాలు, వసతులు, భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయో లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణలో పరిశీలించాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి భద్రత సూచనలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తీ స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ప్యాడి క్లీనర్లు, తార్పాలిన్లు, మాచర్ మిషన్లు, గన్ని సంచులు, లారీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గోనె సంచులను రైతులకు నేరుగా ఇవ్వకుండా, కొలత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పిపిసి సెంటర్ ఇన్‌చార్జీలు కొనుగోలు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే స్వీకరించి ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై కూడా కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ బాల సరోజ, డీఎం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్, సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి, మార్కెటింగ్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: November 19, 2025 7:12 pm