సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను నిజమైన ఖాతాదారులకు అందించడమే లక్ష్యంగా మీ డబ్బు – మీ హక్కు అనే ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ మాధురి, బ్యాంక్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు, దీర్ఘకాలంగా చెల్లింపులు లేని నగదు వంటి ఆర్థిక ఆస్తులను చివరి ఖాతాదారుల వరకు పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలదేనని స్పష్టం చేశారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు వారికి చెందాల్సిందేనని, జిల్లాలోని 17 బ్యాంకుల్లో మొత్తం 23,61,23 ఖాతాలకు సంబంధించిన రూ.51.07 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని ఆస్తులు ఉన్నాయని, అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2కోట్లను ఖాతాదారులకు చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. క్లెయిమ్ చేయని పొదుపు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంగారెడ్డి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం, ఎం జెడ్ రెహమాన్, ఎండి సిసిబి సీఈవో ఎం.శ్రీనివాస్, యు బి ఐ ఏజీఎం బి శ్రీనివాస్, వివిధ బ్యాంకుల సిబ్బంది, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.
క్లెయిమ్ చేయని డబ్బు ఖాతాదారులకే: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288