*సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, నిరంతరం శ్రమించండి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు.*
*లక్ష్యసాధనకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది.*
*బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవాధికార సంస్థ కట్టుబడి ఉంది:*
*జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య*
*బాలసదనంలో ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం*
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి బాల సదనంలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ రాజారెడ్డి, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు డా.చక్రపాణి, రాంమోహన్, విష్ణుమూర్తిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ… బాలసదనం విద్యార్థులు అనాధలమని అధైర్య పడకుండా, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి, నారాయణఖేడ్ పట్టణాల్లో బాలసదనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుందని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు. పిల్లల సురక్షిత జీవనం కోసం ప్రభుత్వం అన్ని విధాలా రక్షణ కల్పిస్తోందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పాలని సూచించారు. ఇక్కడున్న పిల్లలందరూ అడాప్ట్ అయ్యి తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లే రోజు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. బాల సదనాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, కస్తూరిబా స్కూళ్లు సహా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదివే అవకాశం బాలసదనం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీవో రత్నం, హాస్టల్ ఇంచార్జ్ విజయకుమారి, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ యాదగిరి, సిబ్బంది లింగం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.