అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి: జిల్లా కలెక్టర్
వండ్రికల్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 30
కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం వండ్రికల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన కోడిగుడ్ల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం అంగన్వాడి కేంద్రానికి హాజరైన చిన్నారులతో కలిసి రైమ్స్ పాడుతూ, వారి విద్యా ప్రమాణాలు, శారీరక-మానసిక అభివృద్ధి స్థితిగతులపై ఆరా తీశారు. చిన్నారులతో మమేకమై వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, పిల్లల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన విద్యా-ఆట కార్యకలాపాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, కిటికీలు, తలుపులు దెబ్బతిన్న స్థితిలో ఉన్నట్లు గుర్తించి, వాటి మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అంగన్వాడి కేంద్రాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైన నిధులు సమకూర్చి మరమ్మత్తుల పనులు ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో ప్రమీల, తహసిల్దార్ రేణుక, సూపర్వైజర్, అంగన్వాడి టీచర్, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.