సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళలు 30 రోజుల్లో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకొని పురుషులకు తామేమి తక్కువ కాదని నిరూపించారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎస్ బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన మహిళలకు 30 రోజుల పాటు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణంగా డ్రైవింగ్ వృత్తిలో పురుషులే ఎక్కువగా ఉంటారని కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు కూడా ఈ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. మహిళలు కార్ డ్రైవింగ్ తో మహిళా ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా నుండి హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతానికి చేరువలో ఉండడంతో ప్రతిరోజు ఎంతో మంది మహిళా ఉద్యోగులు హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారని ,అలాంటి వారికి మహిళా క్యాబ్ డ్రైవర్లు అందుబాటులోకి వేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మహిళలు శిక్షణ పొందడంతో సరిపెట్టుకోకుండా లెర్నింగ్ లైసెన్స్ తో పాటు శాశ్వత లైసెన్స్ కూడా తీసుకోవాలని సూచించారు. ఇంకా శిక్షణ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలన్నారు. మహిళలు శాశ్వత లైసెన్స్ పొందితే ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందన్నారు. డ్రైవింగ్ వృత్తిలో నైపుణ్యం సాధించుకొని శాశ్వత లైసెన్సు పొంది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంతో పాటు సేఫ్టీ డ్రైవింగ్ చేస్తూ తమ కుటుంబాల ఆర్థిక ఎదుగుదలకు మహిళలకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 30 రోజులు శిక్షణ ముగించుకున్న 33 మంది మహిళలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. శిక్షణలో మహిళలు పొందిన డ్రైవింగ్ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతి పాత డిఆర్డిఏ కార్యాలయం నుండి తన క్యాంపు కార్యాలయం వరకు స్వయం ఉపాధి పథకం కింద శిక్షణ పొందిన మహిళ డ్రైవర్ కారు నడుపుతుండగా.. అందులో కూర్చొని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. డిఆర్ డిఏ, ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల ద్వారా జిల్లాలోని మహిళలకు మగ్గం వర్క్ పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం జయశ్రీ, శిక్షణ కో ఆర్డినేటర్ కె. శివశంకర్, ట్రైనర్ రామమూర్తి, పి.నర్సింలు, రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు 30 రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం గర్వించదగ్గ విషయం: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: January 18, 2025 7:33 pm
