సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రత కార్డుల మంజూరులో సమస్యల ఫిర్యాదు కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుండి చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పథకాల కు సంబంధించిన సర్వే ఫిర్యాదులు, అభ్యంతరాలకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 08455-272233 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సులభంగా సేవలు అందించడానికి ఈ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 08455-272233 ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకొని ప్రజలు ప్రభుత్వ సేవలను సులభతరంగా పొందవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: January 16, 2025 7:59 pm
