Site icon PRASHNA AYUDHAM

రెవెన్యూ సేవల్లో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

IMG 20250516 180550

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మే 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు విశేష చర్యలు చేపట్టామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, దరఖాస్తుల ప్రక్రియ, విధానాలను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. భూ భారతి గ్రామ సభలలో రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు భూ భారతి చట్టం తహసీల్దార్ లాగిన్‌ ద్వారా ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని, దానికి అనుగుణంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు భూమి సంబంధిత సర్టిఫికెట్లు, రికార్డులు పొందడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే మా ప్రథమ లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి రెవెన్యూ అధికారిపై ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి భూ భారతి రెవెన్యూ టీం లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల స్థాయిలో రెవెన్యూ సేవల అమలుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ భారతి ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. భూ భారతి గ్రామ సభల్లో రైతుల నుండి దరఖాస్తులు ఉచితంగా స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులపై అభ్యంతరాలుంటే, వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయడం, ఏడు రోజులలోపే పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి ఏడు రోజులలోపారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ముందుగానే పరిశీలన జరపాలని స్పష్టంగా సూచించారు. భూ భారతి చట్టం అమలులో ఏదైనా అలసత్వం ఉండకూడదని, పటిష్టంగా అమలుచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, దుర్వినియోగాలను గుర్తించేందుకు మండల సర్వే టీమ్‌లు యాక్టివ్‌గా పని చేయాలని కలెక్టర్ సూచించారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల జాబితాను సిద్ధం చేయాలనీ అన్నారు. భూ భారతి పథకం ద్వారా భూ సంబంధిత సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గాల ను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్, ఇతర రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Exit mobile version