నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి :సీఎం రేవంత్

*సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.*

*సాగు చేసిన, చేయకున్న తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని,* అలాగే, *వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని* ముఖ్యమంత్రి చెప్పారు.

*ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేల చొప్పున చెల్లించాలని, ఈ రెండు పథకాలు జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని* చెప్పారు.

ఈ నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలి

*వ్యవసాయయోగ్యం కాని రియల్ ఎస్టేట్ భూములు, లే అవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలి.*

ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధ్రువీకరించుకోవాలి.

*వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి.* వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*రైతు పంట వేసినా, వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది.* వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో పెట్టుబడి సాయం అందించారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదు. అనర్హులను గుర్తించాల్సిన అవసరం ఉంది.

*భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను* ఆదుకునేందుకు *ఇందిరమ్మ ఆత్మీయ భరోసా* పథకాన్ని ప్రారంభించాం. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందించాలి. *ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.*

*రాష్ట్రంలో ‘వన్ స్టేట్ – వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నాం.* తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలి.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలి. *24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలి.*

గూడులేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే *ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం.* అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. *తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం.*

*ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి.* ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి *అర్హుల జాబితాను ఇంచార్జీ మంత్రికి అందించాలి. ఇంచార్జీ మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలి.*

*కలెక్టర్ల పనితీరే ప్రభుత్వం పనితీరుకు కొలమానం.* ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లే ప్రజల్లోకి తీసుకెళాల్సి ఉంటుంది. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. *ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలి.*

ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో ఆదేశాలిచ్చాం. కొంతమంది ఇంకా ఆఫీసులకే పరిమితమవుతున్నారు. *జనవరి 26 తర్వాత స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవు”* అని *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment