జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
— చుక్కాపూర్ ఆయుశ్మాన్ ఆరోగ్య మందిరంలో సదుపాయాల సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మంగళవారం చుక్కాపూర్ ఆయుశ్మాన్ ఆరోగ్య మందిరం (ఆరోగ్య ఉప కేంద్రం)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానికులతో మాట్లాడి ఆరోగ్య సేవల స్థితి గురించి తెలుసుకున్న కలెక్టర్, కేంద్రంలో వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. నీటి సరఫరా కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
గర్భిణీ పరీక్షల కోసం కావలసిన ఎగ్జామినేషన్ మంచాలు, టేబుల్స్ లభ్యం కాని విషయాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను ప్రశ్నించారు. అన్ని ఆయుశ్మాన్ ఆరోగ్య మందిరాలకు అవసరమైన వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని వారికి ఆదేశించారు.
డెంగ్యూ సహా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ప్రభు దయా కిరణ్, వైద్య అధికారి డా. ఆదర్శ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.