ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ…!!
ఆస్పత్రులను పర్యవేక్షించని జిల్లా వైద్యాధికారులు
రోగి కన్నీరు.. ఆసుపత్రులకు నోట్లు..
చికిత్స పేరుతో లక్షల్లో వసూళ్లు..
ఆసుపత్రులే వ్యాపార కేంద్రాలు..
నయం కంటే.. నష్టమే ఎక్కువ.
లింగ నిర్ధారణ, అబార్షన్ల మాఫియా..!
ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీకి అడ్డుకట్ట ఎక్కడ..?
టెస్టుల పేరుతో మోసం.. ప్రజలపై ఆర్థిక బాదుడు.
ఆసుపత్రిలో రోగి మరణిస్తే డీల్.. లోలోపల పరిహారం, బయటకు మౌనం..
అధికారుల నిర్లక్ష్యం.. ఆసుపత్రుల ఆగడాలకు రెక్కలు
ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి, కలెక్టర్ ప్రత్యేక నిఘా తప్పనిసరి.
ప్రశ్న ఆయుధం న్యూస్ ప్రతినిధి: డాక్టర్ అంటే దేవుడి తర్వాత అన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం, దోపిడీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. రోగిని బిజినెస్‌గా చూసే ధోరణి పెరుగుతుండటంతో వైద్య రంగం ప్రతిష్ట క్షీణిస్తోంది. నిజంగా వైద్యం కోసం వెళ్ళినవారు డబ్బు కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయి బయటకొస్తున్నారు… జిల్లాలో ఆరోగ్య రంగం రోజురోజుకూ దోపిడీకి వేదిక అవుతోంది. సామాన్య ప్రజలు రోగాలు నయం అవుతాయన్న ఆశతో అడుగు పెడితే.. ప్రైవేటు ఆసుపత్రులు డబ్బు వేటకు కేంద్రాలుగా మారాయి. సాధారణ రోగాలు, చిన్న హెల్త్ ప్రాబ్లమ్‌కి కూడా అడ్మిట్ చేస్తూ లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. “రోగి ప్రాణం కాపాడాలంటే ఇదీ తప్ప వేరే మార్గం లేదు” అన్నట్టుగా రకరకాల పరీక్షలు, స్కాన్లు, టెస్టులు, ఆపరేషన్లు పేరిట వసూళ్లు జరుగుతున్నాయి.
లక్షల్లో ఫీజులు వసూలు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయితే మొదటిసారి బిల్లు విన్న వెంటనే కుటుంబాలు షాక్‌కు గురవుతున్నాయి. ఒక చిన్న సమస్యకు కూడా 50 వేలు నుంచి లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. రోగి పరిస్థితి సీరియస్ అయితే ఆ మొత్తాలు మరింత పెరిగిపోతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆస్పత్రుల బిల్లులకు అప్పుల పాలవుతున్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకోవడం తప్ప వారికి మార్గం లేదు.
అనవసరమైన పరీక్షల పేరుతో డబ్బులు వసూళ్లు
ఓకే సమస్యకు పది రకాల పరీక్షలు పెట్టడం ప్రైవేటు ఆసుపత్రుల కొత్త వ్యాపార పద్ధతి. రోగి గుండె బాగానే ఉన్నా కూడా ఈసీజీ, 2డి ఈకో, సిటి స్కాన్, ఎంఆర్ఐ తప్పనిసరి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాధారణ ఆపరేషన్‌కైనా అనవసరమైన రక్త పరీక్షలు, ఇతర స్క్రీనింగ్‌లు తప్పనిసరి చేస్తూ అదనపు బిల్లులు వేస్తున్నారు.
లింగ నిర్ధారణ, అబార్షన్ల మాఫియా..!
కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాలు (ఇల్లీగల్ అబర్షన్స్) కూడా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తేలితే డబ్బులు తీసుకుని గర్భస్రావాలు నిర్వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ పద్ధతులు ఒకవైపు (పీసీపీఎన్ డీఐటీ) చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, సమాజంలో లింగ అసమానత పెరగడానికి దారి తీస్తున్నాయి. తల్లుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఈ చీకటి వ్యాపారాన్ని అడ్డుకోవాలంటే జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వైద్య రంగం.
డాక్టర్ అంటే దేవుడి తర్వాత అన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం, దోపిడీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. రోగిని బిజినెస్‌గా చూసే ధోరణి పెరుగుతుండటంతో వైద్య రంగం ప్రతిష్ట క్షీణిస్తోంది. నిజంగా వైద్యం కోసం వెళ్ళినవారు డబ్బు కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయి బయటకొస్తున్నారు.
ఆస్పత్రిలో మరణం జరిగితే పరిహారం ఒప్పందాలు.
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగి మరణిస్తే లోలోపల పరిహారం చెల్లించి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకుంటున్నారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకి వస్తే ఆసుపత్రుల ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో డబ్బులు ఇచ్చి కేసులు కప్పిపుచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల అనేక కుటుంబాలు మౌనంగా న్యాయం కోల్పోతున్నాయి.
ప్రేక్షక పాత్ర వహిస్తున్న జిల్లా వైద్యాధికారులు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. జిల్లా వైద్యాధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన వారు ఎటు చూడకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ఆసుపత్రిని కూడా సరిగా పరిశీలించలేదన్నది స్థానికులు పేర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు హాస్పిటల్స్ ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్ జోక్యం చేసుకోవాలి.
ప్రజల ప్రాణాలను డబ్బు వేటకు పెట్టిన ఆసుపత్రులపై ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు నిర్వహించి, నియమాలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.