సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశవ్యాప్తంగా నవంబరు 20 నుండి 26 వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ కార్యక్రమం విజయవంతంగా జరగేందుకు స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని జిల్లా అటవీ అధికారి శ్రీధర్ రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని అటవీ బీట్ లలో ఒకేసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బీట్ కు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అవసరమని, అటవీ సిబ్బంది పరిమితంగా ఉండటంతో, స్థానిక పట్టభద్రులు, డిగ్రీ / పీజీ విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛంద సేవకులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని, సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 27న సంగారెడ్డిలో ఫీల్డ్ స్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు తమ వివరాలను జిల్లా అటవీ అధికారి కార్యాలయం, సంగారెడ్డిలో (మల్కాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో) వ్యక్తిగతంగా హాజరై నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలా నమోదు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన వారికి త్వరలో ఒక శిక్షణ తరగతి నిర్వహిస్తామని తెలిపారు.