*డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 16
డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. ఉమాగౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఏడీస్ ఈజిప్టై దోమ కాటు ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆమె తెలిపారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు, చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దోమల పెరుగుదలను నియంత్రించడంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల పాత్ర ముఖ్యమని, గృహ సందర్శనల సమయంలో దోమల లార్వాలను నిర్మూలించే పద్ధతులను (ఏ ఎల్ ఓ యాక్టివిటీస్) జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు.
జిల్లా ఎన్సివిబిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై. శ్రీదేవి మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూను అరికట్టేందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దోమల లార్వాలు పెరగకుండా, అవి దోమలుగా మారకముందే వాటిని నిర్మూలించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె కోరారు.
అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్వేత మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖాన లేదా బస్తీ దవాఖానలకు వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా పొందవచ్చని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కౌశిక్, మల్కాజిగిరి జిహెచ్ఎంసి సీనియర్ ఎంటమాలజీ అధికారి వెంకటేశ్వర్, డివిజన్ సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, కీసర డివిజన్ సబ్ యూనిట్ అధికారి కె. వినోద్ కుమార్, జిల్లా కళాజాత బృందం, హెల్త్ సూపర్వైజర్లు టి. గొంగడయ్య, శ్రీమతి అరుణ, జంగయ్య, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత బృందం ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించారు.