31 రాత్రి పోలీసు ఆంక్షలు పాటించాలి : జిల్లా ఎస్పీ పి.జగదీష్‌

*31 రాత్రి పోలీసు ఆంక్షలు పాటించాలి : జిల్లా ఎస్పీ పి.జగదీష్‌*

 

*అనంతపురం*

డిసెంబర్‌ 31 రాత్రి నగరంలో, జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ప్రజలు పోలీసుల ఆంక్షలు పాటించాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ కోరారు. ముందుగా ఎస్పీ జిల్లా ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 31వ తేదీ రాత్రి జిల్లా కేంద్రంలో, ముఖ్య పట్టణాల్లో విధించిన ఆంక్షలను వివరిస్తూ జాతీయ రహదారులు, మిగితా రహదారులు, పబ్లిక్‌ స్థలాలలో వేడుకలు అనుమతించబడవని, టపాసులు కాల్చడం నిషేధమని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే రాదని, విచక్షణ రహితంగా, స్పీడ్‌ గా బైక్‌, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. అలాంటి రైడర్స్‌ పై మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం దుకాణాలను మరియు రెస్టారెంట్లు బార్‌ లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా అనంతపురంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు చేపట్టనున్నట్టు తెలిపారు. రోడ్లపై యువత మద్యం సేవిస్తూ, వీధుల్లో నడుస్తూ, బైక్స్‌ పై తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం, కామెంట్‌ చేయరాదన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై కామెంట్‌, టీజింగ్‌ లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణం లో సన్నిహితులతో మరియు కుటుంబ సభ్యుల తో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని, 31 వ తేదీ రాత్రి నుండీ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువ శబ్దాలు వచ్చే డీజే సౌండ్‌ సిస్టం వంటివి ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, డ్రంకన్‌ డ్రైవ్‌ పై పక్కాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచ్రవాహనాల సైలెన్సర్‌ లు తీసేసి, విన్యాసాలు చేస్తూ అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు నూతన సంవత్సరం సందర్భంగా పిల్లలపై ప్రత్యేక దఅష్టి పెట్టాలన్నారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. నూతన సంవత్సర వేడుకలు అర్థరాత్రి 01:00 గంటలోపే ముగించాలని, ఆ తర్వాత ఏ విధమైనటువంటి వేడుకలు అనుమతించబడవని తెలిపారు. క్రొత్త సంవత్సర వేడుకలు ఎవరి జీవితాల్లో, కుటుంబాల్లో విషాదం మిగల్చరాదని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అంతటా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ ఆఫీసర్ల వద్ద నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని తెలిపారు.

Join WhatsApp

Join Now