సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సమస్యలు తలెత్తడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడి సూచనలు ఇచ్చారు. కేసులను దర్యాప్తు చేయడంలో పారదర్శకత పాటించాలని, చట్ట అమల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. సివిల్ కేసుల్లో పోలీసు జోక్యం ఉండకూడదని కూడా అదనంగా సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమస్యలకు పరిష్కారం లభించనప్పుడు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో అందించే సేవలను వినియోగించుకోవాలని ప్రజలను తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ప్రతి ఫిర్యాదు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ప్రజావాణిలో నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: November 17, 2025 8:17 pm