పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం…
… జిల్లా ఎస్పీ సింధు శర్మ…
జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురు ఆత్మహత్యల ఘటనపై ఎస్పీ సింధూశర్మ స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏడాది క్రైమ్ నివేదికపై నిర్వహించిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ నెల 25న సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామన్నారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులు లేరని, అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా.. కాపాడే క్రమంలో జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వచ్చారనితెలుస్తోందన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బైకుపై పొందుర్తి వరకు వచ్చారని తెలిపారు. కానిస్టేబుల్ శ్రుతి గర్భవతి అనే పుకార్లు వట్టివేనని.. పోస్టుమార్టం రిపోర్టులో ఏం రాలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక, ముగ్గురి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.