-కళాశాలలకు బీసీ విద్యార్థి సంఘం విజ్ఞప్తి.
నిజామాబాద్, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం):
జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నావాతే ప్రతాప్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లను కలిసి దసరా సెలవుల సందర్భంలో ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు దసరా సెలవులు ఉండటం వల్ల అన్ని తరగతులను పూర్తిగా రద్దు చేసి, ఎలాంటి పరీక్షలు లేదా అదనపు తరగతులు నిర్వహించకుండా కళాశాలలను పూర్తిగా మూసివేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ఎస్సార్ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్‌ను కలిసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేశారు. అయితే, కొన్ని కళాశాలలు ఈ నెల 27వ తేదీన ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయని సమాచారం అందింది. దాంతో, వాటిని త్వరితగతిన ముగించి, ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంలో మహిళా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, వారు సకాలంలో తమ నివాసాలకు చేరేలా చూడాలని విద్యార్థి సంఘం సూచించింది.
ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు గోదావరి, జిల్లా నాయకులు గణేష్ యాదవ్, శేఖర్, శ్రీను, పరమేశ్, వెంకట్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.