Site icon PRASHNA AYUDHAM

కీసర వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దు: కలెక్టర్‌కు వినతి

IMG 20250609 WA1841

*కీసర వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దు: కలెక్టర్‌కు వినతి*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూన్ 9

దమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దని కోరుతూ కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగుల రమేష్ ముదిరాజ్ సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో వారు పేర్కొన్న వివరాల ప్రకారం, కీసర ఉమ్మడి గ్రామంలోని కీసరగుట్ట, వన్నీగూడ, కీసర దయారా, కాపు గూడెం ప్రాంతాలు పూర్తిగా దమ్మైగూడ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ప్రస్తుతం కీసర వార్డు కార్యాలయం పాత గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ వార్డు కార్యాలయాన్ని కీసర నుండి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి తెలిసిందని తెలిపారు.

కీసర గ్రామంలో సుమారు 20 వేల మంది నివసిస్తున్నారని, వీరిలో అధిక సంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని, వార్డు కార్యాలయం తరలిస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని, అధికారులకు దూరం అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కావున, దమ్మైగూడ మున్సిపాలిటీలోని కీసర వార్డు కార్యాలయాన్ని కీసరలోనే కొనసాగించి ప్రజలకు సులభంగా పాలన అందించాలని వారు కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో కీసర గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎర్ర సాయిలు, గ్రామ నాయకులు పండుగ రాజలింగం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version