కోరుట్ల బస్తీ దవాఖానలో డాక్టర్లని నియమించాలి
యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్
కోరుట్ల పట్టణంలోని బస్తీ దవాఖానలో డాక్టర్ల కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి రోజూ దాదాపు 80 మంది రోగులు వైద్యం కోసం దవాఖానను ఆశ్రయిస్తున్నా, సరైన వైద్య సేవలు అందక నిరాశ చెందుతున్నారని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముస్లిం సంచార తెగల రాష్ట్ర సలహాదారులు మొహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఈ సమస్యలపై మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ ప్రస్తుతం దవాఖానలో కేవలం ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ నర్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులకు అవసరమైన సేవలు అందడం కష్టమవుతోంది. బస్తీ దవాఖానలో చిన్నారులకు అవసరమైన మందులు.అందుబాటులో లేకపోవడం, దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధులకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు. వైద్య సౌకర్యాల లేమితో పాటు మందుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారిందని, ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, వెంటనే డాక్టర్లను నియమించి, మందులను అందుబాటులో ఉంచకపోతే యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పిల్లల కోసం అవసరమైన.మందులను అందుబాటులో ఉంచాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించి బస్తీ దవాఖాన సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున కోరారు.