ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోల్ మాల్ జరుగుతుంటే పట్టించుకోరా…?

*గడువు ముగిసినా రోడ్డు పనులెందుకు పూర్తి చేయడం లేదు?*

*ప్రజలను ఏళ్ల తరబడి ఇబ్బందికి గురి చేస్తుంటే ఏం చేస్తున్నారు?*

*కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయి తమాషా చేస్తున్నారు*

*ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి*

*నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి*

*స్మార్ట్ సిటీ పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వండి*

*మీరు యూసీలిస్తే…..మిగిలిన నిధులు మంజూరు చేస్తాం*

*రోడ్డు పెండింగ్ పనులు పూర్తి చేశాకే… కొత్త వాటిని మంజూరు చేస్తాం*

*సర్కారీ ఆసుపత్రుల దుస్థితి ఇక మారదా?*

*కేంద్రం నిధులిస్తుంటే… కాటన్, మందులు, ఎక్స్ రే లేదని రోగులను బయటకు పంపిస్తారా?*

*ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోల్ మాల్ జరుగుతుంటే పట్టించుకోరా?*

*ఇకపై సర్కారీ ఆసుపత్రుల రుపురేఖలు మార్చాల్సిందే….*

*పేదలను ఇబ్బంది పెడితే… ఖబడ్దార్…*

*నేషనల్ హెల్త్ మిషన్ నియామకాలపై ఎంక్వేరీ చేసి వారంలో నివేదిక ఇవ్వండి*

*అక్రమార్కుల భరతం పట్టండి*

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు రెండు కళ్లుగా భావించాలి*

*కొందరు అధికారులు ఒంటి కన్నుతోనే వ్యవహరిస్తూ కేంద్ర పథకాలపై నిర్లక్ష్యం చేస్తున్నారు*

*పొగ బాధ ఉండకూడదని ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తుంటే… మీరింకా కట్టెల పొయ్యిపైనే ‘మిడ్ డే మీల్’ వండుతారా?*

*వందలాది మంది విద్యార్థులున్న చోట పొగ బెడితే… వాళ్ల ఆరోగ్యం పాడైపోదా?*

*ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పరిధిలో వంట గ్యాస్ పైనే ‘మధ్యాహ్న భోజనం’ వండాల్సిందే*

*15 నుండి 20 రోజుల్లో ఆ దిశగా చర్యలు తీసుకోండి…*

*కూలీలకు 100 రోజులు ఎందుకు పని కల్పించలేకపోతున్నారు?*

*నరేగా ద్వారా ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు?*

*నా పార్లమెంట్ పరిధిలో పరికరాలు అందని దివ్యాంగులు ఉండకూడదు*

*ఎంపీ లాడ్స్ నిధుల పనుల్లోనూ ఆశించిన ప్రోగ్రెస్ లేకపోతే ఎట్లా?*

*‘దిశ’ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…*

*రెండు గంటలకుపైగా వాడి వేడిగా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం*

*వివిధ శాఖలపై క్షుణ్నంగా సమీక్షిస్తూ…అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి*

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో గడువు ముగిసినా పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్ గా మారి తమాషా చేస్తూ ప్రజలకు ఏళ్ల తరబడి ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై చూస్తూ ఊరుకోబోమని సిండికేట్ గా మారి గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60 సీ కింద నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్య, వైద్య శాఖలకు నిధులిస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు పైసలిస్తున్నా… వాటి పనితీరు మెరుగుపర్చుకోకపోవడంపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల, వేల కోట్ల నిధులిస్తున్నా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాటన్ లేదంటారు. మందుల్లేవంటారు. ఎక్స్ రే మిషన్ కరాబైందంటారు? దశాబ్దాలు మారినా సర్కార్ ఆసుపత్రుల తీరు మారదా? పేదలకు రోగమొస్తే ఏకైక దిక్కు ప్రభుత్వ ఆసుపత్రులే కదా.. వీటి తీరు మారకపోతే వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా?. రోజూ పత్రికల్లో వార్తలొచ్చినా మీరు చలించరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారాల్సిందేనని, లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపారు. నేషనల్ హెల్త్ మిషన్ నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో ఎంక్వేరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. మోదీ ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ… కట్టెల పొయ్యి బాధ లేకుండా చేస్తుంటే… వందలాది మంది పిల్లలు చదువుకునే పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వారి ఆనారోగ్యాలను దెబ్బతీయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్యాస్ స్టవ్ పై మధ్యాహ్న భోజనం వండిపెట్టాలని ఆదేశించారు.  కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘దిశ’ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, కేంద్ర హోంశాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ ఐఏఎస్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ వాజ్ పేయిసహా వివిధ శాఖల అధికారులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండున్నర గంటలపాటు వాడివేడిగా సమావేశం జరిగింది. వివిధ శాఖలపై కేంద్ర మంత్రి క్షుణ్నంగా సమీక్షించారు. ఆయా శాఖల లోటుపాట్లపై చర్చించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎప్పటికప్పుడు చురకలు వేశారు. ఈ సందర్భంగా ఏయే శాఖలపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే…. 

ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏ శాఖలో చూసినా కేంద్ర నిధుల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఎవరూ కాదనలేని నిజం. గ్రామీణ వ్యవస్థకు మూలాధారమైన ఎన్నో కార్యక్రమాలకు సెంట్రల్ ఫండ్ ప్రాణం పోస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని ప్రగతి పనులకు కూడా కేంద్రం ఇచ్చే పైసలే అండగా నిలుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక్కడున్న చాలా శాఖల మునుగడకు కేంద్రం నిధులు ఆధారమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కళ్లుగా భావించాలి. కానీ కొందరు అధికారులు ఒంటి కన్నుతో చూస్తూ కేంద్ర పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది బాధాకరం. అధికారులు, పాలకులు ఏదో మంచి చేస్తారనే భావనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు సేవ చేయడం అదృష్టంగా భావించాలి. ఏ అధికారికైనా.. మీకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు సమానమనే భావన ఉండాలి. అంతిమంగా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరాలి. మనపైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటిని మనం నెరవేర్చకుంటే మనం ఉండి.. ఏం లాభం.! నా వరకు మాత్రం నేనెప్పుడూ ప్రజల పక్షమే.. నేనెప్పుడూ ఒక లీడర్ లాగా ఫీల్ కాను. నేను కామన్ మ్యాన్ ని. ఇక్కడ గల్లీలో ఉన్నా ..‌అక్కడ ఢిల్లీలో ఉన్నా నా పార్లమెంట్ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం. మొదట ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే అటు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత సేవ చేయాలో అంత సేవ చేశాను. అందుకే మళ్ళీ ఇదే ప్రజలు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో నాకు అవకాశం ఇచ్చారు. ఈసారి మరిన్ని నిధులు తీసుకొచ్చి నా పార్లమంట్ నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివ్రుద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా.

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద రూ.398 కోట్లు మంజూరు చేసినా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించలేదు? మీరు యూసీ సమర్పించకపోవడంవల్లే కేంద్రం మిగిలిన నిధులు మంజూరు చేయడం లేదు. మీరు ఎంత తొందరగా యూసీ సమర్పిస్తే… అంత తొందరగా మిగిలిన రూ.70 కోట్ల నిధులను మంజూరు చేయిస్తా. అట్లాగే అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనుల్లో ఏది స్మార్ట్ సిటీ నిధులతో చేస్తున్నారో, ఏది నియోజకవర్గ అభివ్రుద్ధి నిధి(సీడీఎఫ్) కింద చేస్తున్నారో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మంగళ్ వాడలో నిర్మిస్తున్న రోడ్డును మధ్యలో ఆపేశారు. ఇదేందంటే ఒకరేమో స్మార్ట్ సిటీ నిధులన్నారు. ఇంకొకరేమో సీడీఎఫ్ నిధులు విడుదల కాలేదన్నారు.ఇది కరెక్ట్ కాదు… స్మార్ట్ సిటీ నిధులతో ఏయే పనులు చేపడుతున్నారు? సీడీఎఫ్ నిధులతో ఏ పనులు చేపడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలు ఇవ్వండి. అట్లాగే నగరంలో చేపట్టిన రోడ్లు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. కాబట్టి ఇకపై కొత్తగా రోడ్ల నిర్మాణాలను మంజూరు చేయకండి. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులన్నీ పూర్తయిన తరువాతే కొత్త రోడ్లను మంజూరు చేయండి. కొత్త రోడ్లు, పనులకు సంబంధించి అవసరమైతే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

వైద్యశాఖపై….

కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా 2022-23 ఆర్దిక సంవత్సరానికి రూ.7 కోట్లు, ఈ ఆర్దిక సంవత్సరంలో 5.29 కోట్లు ఖర్చు చేశామన్నారు? ఆ నిధులను దేనికి ఖర్చు పెట్టారు ? ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేదు? కేంద్రం నుంచి అందే ప్రతి పైసాకు పక్క లెక్క ఉండాల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా చూసినా, ఏ పత్రికల్లో చూసినా కాటన్ లేదు, మందుల్లేవు, సూదుల్లేవు, ఎక్స్ రే మిషన్ పాడైంది… రోగులు అల్లాడుతున్నారని రోజూ వార్తలు వస్తున్నా మీరు చలించరా? దశాబ్దాల తరబడి వార్తలొస్తున్నా పట్టించుకోరా? గతంలో జిల్లా ఆసుపత్రి నిధుల గోల్మాల్ విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నిధుల గోల్ మాల్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? కరీంనగర్ ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్ ఉన్నా పనిచేయనియ్యరు. చిన్న రేపేర్ చేస్తే బాగైతదని తెలిసి దానిని మూలన పడేసి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారు? సర్కార్ ఆసుపత్రులకు వచ్చేదే పేదలు… వాళ్ల దగ్గర డబ్బులుండవు. అట్లాంటోళ్లపై భారం మోపితే ఎట్లా?

నా బర్త్ డే రోజున రూ.4 కోట్ల మెడికల్ పరికరాలను, అంబులెన్సులను అందజేస్తే… చిన్న రిపేర్ వచ్చిందని అంబులెన్సులను మూలన పడేశారు… అసలేమనుకుంటున్నారు? మళ్లీ ‘దిశ’ సమావేశం నిర్వహించే నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోవాలి? కాటన్ లేదని, మందుల్లేవని, ఎక్స్ రే మిషన్ లేదనే ఫిర్యాదులు రావొద్దు. అవసరమైతే కొత్త ఎక్స్ రే మిషన్ ను కరీంనగర్ ఆసుపత్రికి అందిస్తా… అట్లాగే టీ హబ్ లో నిర్వహించే ల్యాబ్ పరీక్షల నిధులన్నీ కేంద్రానివే. కానీ టీ హబ్ బోర్డుపై మాత్రం ప్రధాని ఫోటో ఉంచరు? ఇదేం పద్దతి? అధికారుల పద్దతి మారాలి. ఇకపై టీ హబ్ లపై ప్రధాని ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకుండా చర్యలు తప్పవు.

గత ఐదారేళ్లుగా నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో చేపడుతున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నారు. ఎవరో లీడర్ చెప్పారని, లంచం తీసుకుని అర్హత లేనోళ్లకు, నాన్ లోకల్ కు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు నాకు ఫిర్యాదులు వచ్చాయి. అర్హులను పక్కనపెట్టి అర్హత లేనోళ్లకు ఉద్యోగాలివ్వడం సహించరాని విషయం. రోజ్ గార్ మేళా ద్వారా కేంద్రం 9.25 లక్షలు ఉద్యోగాలను ఏ చిన్న అవినీతి, అక్రమాలకు తావులేకుండా భర్తీ చేశాం. మీకెందుకు ఇది చేతకావడం లేదు? వెంటనే గత ఐదేళ్లలో ఈ నియామకాలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులొచ్చాయి? ఎంత మందిని ఏ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నారనే పూర్తి వివరాలివ్వండి. కలెక్టర్ గారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వండి. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరాలివ్వండి.

టీబీ రోగులకు సంబంధించి వారి పోషకాహారం సంబంధించి మనం రూపాయలు 3 వేలు అందిస్తున్నామా? లేదా 30,000 అందిస్తున్నామా..? మీరిచ్చే నివేదిక తప్పుల తడకగా ఉంటే ఎలా? అసలు వాళ్లకు ఎంత ఇస్తున్నామో మీకు సరిగా తెలియడం లేదంటే ఏమనుకోవాలి? బాధ్యతాయుతమైన ఒక దిశ మీటింగ్ కి సమాచారం ఇస్తున్నామంటే పర్యవేక్షణ ఉండదా ..? పరిశీలన ఉండదా..? టీబీ రోగులకు 2022 ఏడాదిలో దాదాపు 42 లక్షల 86వేలు మనం అందించాం. ఈ ఏడాది లో ఇప్పటివరకు 23 లక్షల 59 వేలు ఇచ్చాం.‌ కనీసం ఆ బాధితులకు ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డబ్బులని తెలుసా.. తెలియదా..? కనీసం వారికైనా చెప్పండి ఇది సెంట్రల్ ఫండ్ .. మోడీ గారు ఇస్తున్నారని..ఎలాగూ మీరు ప్రధానమంత్రి మోదీ గారి ఫోటోలు ఎక్కడా కనిపించనియ్యరు.

RBSK (రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం)… పాఠశాల విద్యార్థుల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవడానికి ఉన్న టీంలు పనిచేస్తున్నాయా? ఇవన్నీ కేంద్ర నిధులతో నడిచేవే. వీళ్లు సీరియస్ గా పనిచేస్తలేరు. కేంద్ర నిధులతో నడుస్తున్న వాహనాలను పర్సనల్ గా వాడుకుంటున్నట్లు నా ద్రుష్టికి వచ్చింది. మీరేమో వాహనాలకు జీపీఎస్ ఉంటుందంటున్నారు. మరి రోజూ మానిటరింగ్ చేస్తున్నారా? చేస్తే ఎవరెవరు ఎక్కడికి పోతున్నారు? ఆ డేటా ఇవ్వండి.. ఫీల్డ్ లో ఉంటే అభినందిస్తా… లేకుంటే మీపై యాక్షన్ తీసుకుంటా.

విద్యాశాఖపై….

విద్యార్థుల్లో నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వ ,పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి ఒక్కో పాఠశాలకు కేంద్రం నుంచి నిధులిస్తే…రెండు, మూడు స్కూల్స్ లో మినహా మిగిలిన వాటిల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. అసలు ఎంతమంది విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేపడుతున్నారు.? వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఆ నిధులను పక్కాగా వాడుతున్నారా?(అధికారుల నుండి సమాధానం రాకపోవడంతో….) ఆ డబ్బులన్నీ ఊరికే ఖర్చు చేశారా? సైన్స్ అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ చేయరా? డీఈవో ఏం చేస్తున్నారు? మీరు ఎన్నింటిని విజిట్ చేశారు.? ఇకనైనా పనితీరు మార్చుకోండి. కేంద్ర నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా బాధ్యతతో పనిచేయండి..

మధ్యాహ్న భోజన పథకం (MID DAY MEAL)లో గుడ్లు ఇవ్వడం లేదని నిత్యం వార్తలొస్తున్నాయి. నిజానికి వారానికి 3 గుడ్లు పెట్టాలి. కానీ అరటి పండుతో సరిపెడుతున్నట్లు నా ద్రుష్టికి వచ్చింది. ఎందుకిలా జరుగుతోంది(గుడ్డు ధర పెరిగినందున గుడ్డు ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్పడంతో…). ఆ విషయాన్ని ఇప్పటిదాకా మా ద్రుష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఈ అంశాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళతాం.. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశంలో ఎవరూ పొగబారిన పడి బాధలు పడకూడదనే ఉద్దేశంతో పేదలందరికీ ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. కానీ వందలాది మంది విద్యార్థులు ఒకే చోట కూర్చుని చదువుకునే స్కూల్ లో కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండిపెట్టడం ఎంత వరకు కరెక్ట్? గ్యాస్ కు పైసలిస్తున్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? సిరిసిల్లకు రూ.52 లక్షలు మంజూరైనయ్. కరీంనగర్ ఎందుకు ద్రుష్టి సారించలేదు. ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో మధ్యాహ్న భోజన తయారీకి కట్టెల పొయ్యిని బంద్ చేయండి. ఈ రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘గ్యాస్ స్టవ్’పై భోజనం వండి పెట్టండి. దీనిపై రెండు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక ద్రుష్టి సారించండి. 15 నుండి 20 రోజుల్లో పూర్తిస్థాయిలో దీనిని అమలు చేసి తీరాల్సిందే…

సమగ్ర శిక్షా అభియాన్(SSA) కార్యక్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా… ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఏడాది సిరిసిల్ల జిల్లాకు 28 కోట్ల 62 లక్షలు ఇస్తే… 8 కోట్ల 55 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు? మిగిలిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదు. అసలు ఆ నిధులు మీ వద్దే ఉన్నాయా? డైవర్ట్ చేశారా? రాష్ట్ర వాటా నిధులు విడుదల చేశారా? ఆ వివరాలన్నీ పంపండి. ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలిస్తున్నారా? మరి వాళ్లెందుకు ఆందోళన చేస్తున్నారు? వాళ్లని సముదాయ కూడా ఎందుకు ఇవ్వడం లేదు? చదువు చెప్పాల్సినోళ్లు రోజుల తరబడి రోడ్డెక్కితే..పిల్లలకు చదువెవరు చెబుతారు? వాళ్లకు అర్ధమయ్యే నచ్చచెప్పి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏం చేయాలో ఆలోచించి చర్యలు తీసుకోండి…

సర్కారీ బడుల్లో చదివే పిల్లలకు రవాణా ఖర్చులు ఇస్తున్నాం. కానీ ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించరు. అసలు పిల్లలకు రవాణా పైసలిస్తన్నారా? ఇస్తే ఆ వివరాలు వెంటనే పంపండి… పీఎం శ్రీ ( ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో 13, సిరిసిల్ల జిల్లాలో 11 స్కూల్స్ ఎంపిక చేసి రూ.52 లక్షలు విడుదల చేసినం. వాటిని దేనికి ఖర్చు చేశారు? ఒకవేళ ఖర్చు చేయకుంటే వేటి కోసం ఖర్చు చేస్తారో రిపోర్ట్ నాకు ఇవ్వండి. పీఎం శ్రీ పథకం కింద ప్రతి ఏడాదికి 40 లక్షల రూపాయిల చొప్పున నిధులు ఐదేళ్లపాటు అందుతాయి. ఈ నిధులను పక్కాగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాడితే బాగుంటుంది. ఆ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతాయనే సంగతిని గుర్తుంచుకోండి.. ఈ నిధులు వేరే వాటికి డైవర్ట్ కాకుండా కలెక్టర్లు బాధ్యత వహించాలి.

రోడ్లు- వంతెనలు

పీఎంజీఎస్ వై(ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ) పథకంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో గత ఆర్దిక సంవత్సరంలో 12 రోడ్ల (80కి.మీలు) నిర్మాణం కోసం రూ.46 కోట్లు మంజూరు చేసినం. ఇందులో ఒకటే వర్క్ పూర్తయింది. మిగిలినవి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అసలు ఎన్ని నెలల్లో పూర్తి చేయాలి? కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి. అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత గడువులోగా ఎందుకు పూర్తి చేయడంలేదు. అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి 2021-22 సంవత్సరానికి 150 కి.మీల మేరకు 219 కోట్లతో 16 రోడ్లు శాంక్షన్ చేయించిన. ఇందులో ఒకటి రెండు తప్ప 18 నెలల గడువు తీరినా ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. కారణమేంది? 2022-23కి సంబంధించి 107 కోట్లతో 4 రోడ్లు (57కి.మీలు) శాంక్షన్ చేయించిన. వాటి ప్రోగ్రెస్ కూడా పెద్దగా లేదు… ఎందుకు ఆలస్యమైతోంది? ఏళ్ల తరబడి ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోకుంటే ఎట్లా?

ఆర్ అండ్ బి ఎస్ఈ గారు…అసలు మీరేం చేస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పండి. తీగలగుట్టపల్లిలో సేత బంధు పథకం కింద పూర్తిగా కేంద్రం నిధులతో (రూ.154 కోట్లు) ROB (Road over bridge)శాంక్షన్ చేయించిన. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపించి నిధులు తీసుకొచ్చాను. ఇప్పటికీ గుంతల పడ్డ రోడ్లు. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మేం నిధులు తెస్తే… గత ప్రభుత్వ నాయకులు కొబ్బరికాయ కొట్టి ప్రచారం చేసుకుంటరు. అసలు పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ ఛీప్) నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకుని సైడ్ రోడ్లకు రూ.36 లక్షలు మంజూరు చేయించినా ఎందుకు వాటిని పూర్తి చేయలేదు? ప్రజలకు ఏం చెప్పాలే. ఇంత నిర్లక్ష్యమా? అసలేమనుకుంటున్నారు? డబ్బులుండి కూడా ఎందుకు పూర్తి చేయడం లేదు? అసలు మీ సమస్య ఏంది?… ఇకపై మీ వెంట పడతా.. నేను కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకునే మనిషిని కాదు… నాకు ప్రజలే ముఖ్యం. రోడ్లకు అధికారులే జవాబు దారీ…

కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయి తమాషా చేస్తున్నారు. ఒక్కరే 10, 20 పనులు తీసుకుని తట్టెడు మట్టి పోసి పనులను పెండింగ్ లో పెడుతున్నారు. కేంద్ర నిధులను వేరే పనులకు డైవర్ట్ చేస్తున్నరు. ఆ పనులకు సంబంధించి స్టేట్ నుండి బిల్లులు రాకుంటే… కేంద్ర నిధులతో చేపట్టిన రోడ్డు పనులను ఆపేస్తున్నారు. ఇకపై కాంట్రాక్టర్ల ఆటలు సాగవు. రెండు జిల్లాల కలెక్టరలకు చెబుతున్నా.. జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఎందుకు ఆగిపోయాయి? వాటి కారణమేంటి? గడువు ముగిసినా ఎందుకు పూర్తి చేయలేదో వారం, 10 రోజుల్లో విచారణ జరపండి. బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోండి. సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి. అవసరమైతే 60 సీ కింద కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి. దాని ప్రకారం చర్యలు తీసుకోండి. ఇదంతా వచ్చేనెల 5లోగా జరగాలి. దీనిపై జనవరి తొలివారానికల్లా నాకు నివేదిక ఇవ్వండి… నిధులు వాడుకుని పనులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి తమాషా చేసేవాళ్లపై ఉక్కుపాదం మోపండి…. గడువులోగా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లపై ఏయే చర్యలు తీసుకున్నారో నాకు వివరాలు (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) పంపండి…

సంక్షేమంపై….

బేటీ బచావో.. బేడీ పడావో, పోషక్ అభియాన్ సహా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించండి… బేటీ బచావో పథకం విషయంలో గతంలో రెండేళ్ల కింద చేయని పనులకు బిల్లు పెట్టిన ఉదంతాలు మీడియాలో వచ్చిన విషయం మీకు తెలిసిందే. అప్పట్లో విచారణ చేపట్టి కొందరిపై చర్యలు తీసుకున్నాము.‌ ఈసారి ఈ కార్యక్రమానికి సంబందించి మంజూరు చేసిన నిధులను వేటికి ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు పంపండి…అట్లాగే దివ్యాంగులకు ఆసరాగా ఉండేందుకు పరికరాలు అందించేందుకు అమలు చేస్తున్న సుగమ్య భారత్ అభియాన్ మంచి ఫలితాలిస్తోంది. వందలాది మంది దివ్యాంగులకు కరీంనగర్ లో ఇచ్చినం. సిరిసిల్ల జిల్లాలో కూడా గతంలో ఇచ్చాం. ఈ విషయంలో అధికారులను అభినందిస్తున్నా.

అయితే ప్రజావాణీతోసహా ఎక్కడ చూసినా ఇంకా దివ్యాంగులు లైన్లో నిలబడి పరికరాల కోసం విజ్ఝప్తులిస్తుండటం చూస్తున్నా. నా వద్దకు కూడా చాలా మంది వస్తున్నారు. అందుకే ఈ రెండు జిల్లాల్లో ఇంకా ఎంత మంది దివ్యాంగులున్నారు. ఏయే పరికరాలు కావాలి? ఎంత ఖర్చవుతుందనే అంశంపై పూర్తి వివరాలు నాకు పంపండి. అందరికీ పరికరాలిద్దాం. అవసరమైతే ఎంపీ లాడ్స్ నిధులను వినియోగిద్దాం… అంతిమంగా నా లక్ష్యం ఒక్కటే… నా పార్లమెంట్ నియోజకవర్గంలో పరికరాలు లేని దివ్యాంగులు ఉండకూడదు. అదే సమయంలో ఒకే దివ్యాంగికి రెండు, మూడు పరికరాలిచ్చి పథకాన్ని నీరుగారకుండా చూడాలి… ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఫలానా ఎక్విప్ మెంట్ అందలేదనే వార్త రాకూడదు. అలాంటి ఈరోజు మనం తీసుకొద్దాం.

ఉపాధి హామీ పథకం ( నరేగా)పై…

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఆశించిన సంఖ్యలో ఎందుకు పనిదినాలు కల్పించలేకపోతున్నారు? 2024 -25 ఈ ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో 2170 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు అందాయి. అట్లాగే గతేడాది 2023..24 ఆర్దిక సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో 7520 కుటుంబాలు వంద రోజులు పని దినాలను అందుకున్నాయి. దీన్నిబట్టి చూస్తేనే మనం పనులను ఎంపిక చేసే విధానము వారికి పని కల్పించే విషయంలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సిరిసిల్ల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ మరీ ఘోరం. ఈడ కేవలం 693 ఇళ్లలోని వారు మాత్రమే వంద రోజులు పనిని అందుకున్నారు. 90 వేలకు పైగా జాబ్ కార్డులుంటే చాలా తక్కువ మందికి పని కల్పిస్తున్నారు. అట్లాగే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వేతనం కూడా తక్కువ వస్తోంది. వీటిపై సీరియస్ గా ద్రుష్టి సారించండి. కచ్చితంగా వంద రోజుల పని కల్పిస్తే… ఆ కుటుంబాల్లోని పిల్లలకు ఉన్నతి ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇస్తాము అవసరమైతే ప్లేస్మెంట్ ఇస్తాం కదా.. తద్వారా ఆ కుటుంబమంతా బాగుపడుతుంది కదా… విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అంతిమంగా నా పార్లమెంట్ పరిధిలోని యువత ప్రతి ఒక్కరికీ వారి వారి అర్హతలకు తగినట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. దయచేసి సహకరించాలని కోరుతున్నా…

సౌరశక్తి (సోలార్)….

ప్రియతమ ప్రధానమంత్రి మోదీజీ సోలార్ కు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈసారి ఒక కోటి కుటుంబాలు సౌర విద్యుత్తు వాడే విధంగా చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టుకునే ఏర్పాటుకు భారీగా రాయితీ ఇస్తున్నారు. ఒక కిలో వాట్ కింత? రెండు కిలో వాట్ కింత? మూడు కిలోమీటర్ల కింత అనే విధంగా రాయితీ ని మెరుగుపరిచారు. సోలార్ డిపార్ట్మెంట్ అధికారుల పనితీరు వెరీ పూర్. అసలు మీరు ఏమేం చేస్తున్నారు? అసలు మీరిచ్చిన రిపోర్టే గందరగోళంగా ఉంది. ఇంటర్నెట్ కు వెళ్లి గూగుల్ ఓపెన్ చేసి అందులో ఉన్న దాన్ని కాపీ చేసి దిశ నోట్ లో పెట్టారు? సోలార్ అంటే ఏమిటి? లైట్లు ఎప్పుడు ఆర్పేయాలి. కరెంట్ ను ఎలా వాడుకోవాలి అనే వివరాలు తప్ప ఇందులో ఏమైనా ఉన్నాయా? తమాషా చేస్తున్నారా? ఈ మూడు పేజీల్లోనే మీ పనితీరు ఎట్లుందో అర్ధమవుతోంది. 2022- 23 సంవత్సరంలో పది మెగావాట్ల లక్ష్యం పెట్టుకుంటే… కేవలం 461 కిలోవాట్ కు మాత్రమే పరిమితం. 117 మందికి మాత్రమే ఇచ్చారు. పెట్టుకున్న లక్ష్యానికి, చేరుకున్న దానికి సంబంధముందా? దీన్నిబట్టి మీరు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారనేది అర్థమవుతుంది.

మనం గతంలో సోలార్ డిపార్ట్మెంట్ ద్వారా తక్కువ విద్యుత్తు వినియోగించుకునే విధంగా మనం ఫ్యాన్లు అందించాము. మహిళా సంఘాలకు.. ఎన్నింటికి సోలార్ ఫ్యాన్లు అందించారు? ఆ వివరాలు ఉన్నాయా..? ఒక ఫ్యాను విత్ రిమోట్ కు 3500 రూపాయలైతే… మహిళా సంఘాలకు కేవలం 500 రూపాయలకే అందించాలి.‌ కానీ మన జిల్లాలో అవేవీ కూడా అర్హులకు అందలేదు. అంతా గ్రామస్థాయి లీడర్ల ఇళ్లల్లోకి వెళ్లాయని నాకు సమాచారం ఉంది. దీని మీద నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. లబ్ధిదారుల జాబితా నాకు అందించాలి. కలెక్టర్ … దీని మీద ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోండి. పూర్తి వివరాలతో నాకు రిపోర్ట్ మీరు ఇవ్వండి. గోబర్ గ్యాస్ విషయంలోనూ గతంలో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది.

ఎంపీ లాడ్స్ నిధులపై…

ఎంపీ నిధుల అభివృద్ధి పనుల విషయంలో అనుకున్నంత ప్రోగ్రెస్ కనిపించడం లేదు. ఈ ఏడాదికి సంబంధించి ఐదు కోట్ల ఖర్చు విషయంలో ఇంకా అనుకున్న పురోగతి లేదు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయంలో మరి ఎందుకు నిధులను పక్కాగా వినియోగించలేకపోతున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. నాకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఎంపీ నిధులు అనేసరికి కొంచెం కావాలని ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.‌ దీని మీద నాకు క్లారిటీ ఇవ్వాలి. రెండు జిల్లాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పనుల పురోగతి ఏమిటి? గడువులోగా పనులెందుకు పూర్తి చేయలేకపోయారు?ఏయే చర్యలు తీసుకున్నారో తక్షణమే పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి…

Join WhatsApp

Join Now