Site icon PRASHNA AYUDHAM

ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి…

Picsart 25 07 02 23 04 10 520

ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి…

హైద‌రాబాద్‌: ప‌దో త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తోంద‌ని… ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి గ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు. విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందున‌.. ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ల‌భించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉంటుంద‌ని.. అక్క‌డ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు. ఇంట‌ర్మీడియ‌ట్ వేరుగా.. 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్య‌య‌నం చేసి ఈ విధానంపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యంలో విద్యా క‌మిష‌న్, ఆ విభాగంలో ప‌ని చేసే ఎన్జీవోలు, పౌర స‌మాజం సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్య మెరుగుకు అన్ని ద‌శ‌ల్లో చ‌ర్చించి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ‌కు పెడ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్‌లో విద్యార్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపైనా దృష్టిపెట్టాల‌న్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల న‌మూనాల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌తి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. పాఠ‌శాల‌ల నిర్మాణం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , నిర్మాణాల ప్ర‌గ‌తిపై ప్ర‌తి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌న్నారు. ఇప్ప‌టికే ఒక్కో పాఠ‌శాల‌కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యినందున‌, రెండో పాఠ‌శాల‌కు సంబంధించిన స్థ‌ల గుర్తింపు, సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించాల‌ని సీఎం ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం నిర్మాణ న‌మూనాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప‌లు మార్పుల‌ను సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిత‌, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version