*అనుమతులు లేని తరగతులు: నాగారం ప్రాంతంలో రెండు పాఠశాలలపై విద్యాశాఖ ఉక్కుపాదం*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 7
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, నాగారం ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అదనపు తరగతులు నిర్వహిస్తున్న రెండు ప్రముఖ ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. మండల విద్యాశాఖ అధికారి జమదగ్ని అకస్మాత్తుగా ఈ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నడుస్తున్న తరగతులను సీజ్ చేశారు.
తనిఖీల్లో బయటపడ్డ విషయాలు:
🔹 ఐరిష్ ఎడువల్లే స్కూల్ – రాంపల్లి బ్రాంచ్:
ఈ పాఠశాలకి 8వ తరగతి వరకు మాత్రమే అధికారిక అనుమతి ఉంది. కానీ అధికారులు చేసిన తనిఖీల్లో 9వ మరియు 10వ తరగతులను కూడా నడుపుతున్నట్లు వెల్లడైంది. వెంటనే ఈ రెండు తరగతులను సీజ్ చేసి, పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
🔹 శ్రీ చైతన్య స్కూల్ – నాగారం బ్రాంచ్:
ఈ పాఠశాలకు కేవలం 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులుండగా, 8వ, 9వ, 10వ తరగతులను అక్రమంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే ఈ తరగతులన్నింటినీ సీజ్ చేశారు.
విద్యాశాఖ హెచ్చరిక:
గత సంవత్సరం నుంచి ఈ రెండు పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకొని తరగతులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంలో మండల విద్యాశాఖ అధికారి జమదగ్ని మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ఏ విద్యాసంస్థనైనా ఉపేక్షించము. అనుమతులకు మించి తరగతులు నడిపితే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి:
తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలని జమదగ్ని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేని తరగతుల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, మానసికంగా కూడా ప్రభావం పడవచ్చని చెప్పారు.