బాల్కొండ మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బిసి సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను బాల్కొండ మండల ప్రత్యేక అధికారి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్ ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థుల వసతులు, విద్యా ప్రమాణాలు, భోజన నాణ్యతతో పాటు ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
బాల్కొండ మండల ప్రత్యేక అధికారి రాకేష్, మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, మండల తాసిల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తదితర అధికారులతో కలిసి గురుకుల పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
విద్యార్థులతో నేరుగా సంభాషించిన ప్రత్యేక అధికారి, వారి విద్యా ప్రమాణాలు, కల్పిస్తున్న వసతులు, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం, పండ్లు, గుడ్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, వసతి గృహాలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి, బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల బోధనా తీరు, హాస్టల్లో అందుతున్న సదుపాయాలపై విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థినులు సెల్ఫీలు తీసుకోవడానికి రంగ బాక్సులు ఏర్పాటు చేయాలని హాస్టల్ యజమానికి సూచించారు.
పాఠశాలలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారంపై మండల అభివృద్ధి అధికారి, మండల తాసిల్దార్, ఇరిగేషన్ అధికారులు, ఏపీవో ఇందిరా, హెల్త్ డిపార్ట్మెంట్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ హైమావతి తదితరులతో ప్రత్యేక అధికారి చర్చించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.










