అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మండలంలోని అన్ని గ్రామాలలోని పాఠశాలల్లో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ప్రత్యేక అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణలో యోగా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయాలని ఆయన సూచించారు. బాల్కొండ జ్యోతిబాఫూలే క్రీడా మైదానం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో జరిగిన వేడుకల్లో ఆయన విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం అందించారు.
ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చని, క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే చదువులోనూ రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హైమావతి, మండల పిడి రాజకుమార్, ఉపాధ్యాయులు ఓ శ్రీనివాస్, బి శంకర్, స్వర్ణలత, సంగీత తదితరులు పాల్గొన్నారు.










