కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన ఘటన కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భిక్కనూరు మండలంలోని భగీరత్పల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు భోజనం చేయకుండానే అన్నాన్ని అక్కడికక్కడే పారబోశారు. నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత కలిగిన ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని వారు తెలిపారు. ఇది విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అంశమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. సమస్యపై స్పందించాల్సిన మండల విద్యాశాఖ అధికారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను మెరుగుపరచాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


