నిజామాబాద్ జిల్లాలో సీబీఎస్సీ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషద్ (టీఎస్పీ) జిల్లా కలెక్టర్‌ను కోరింది. భవన నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు ఇవ్వడం, అనుమతులు లేకుండా బ్రాంచ్‌లు తెరవడం వంటి ఆరోపణలున్నాయి.
తెలంగాణ విద్యార్థి పరిషద్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సీబీఎస్సీ పేరుతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ, రోడ్లపై పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
భవనాలు పూర్తి కాకముందే వందలాది మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారని, ముఖ్యంగా నారాయణ సీబీఎస్సీ, చైతన్య సీబీఎస్సీ, అల్ఫోర్స్ సీబీఎస్సీ వంటి సంస్థల పేర్లతో జిల్లాలో అనేక చోట్ల అనుమతులు లేకుండా బ్రాంచ్‌లు ప్రారంభించి విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి అక్రమాల వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కనీస మౌలిక వసతులు లేకుండానే అడ్మిషన్లు ఇస్తున్న యాజమాన్యాలపై తక్షణమే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో సిద్ధు, సోనూ, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

