సంగారెడ్డి, జులై 16
కందిలోని ఐఐటీలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారికి స్థానిక ధృవపత్రాలు, ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయొద్దని ఐఐటీ ఉద్యోగాల పోరాట సమితి అధ్యక్షుడు కలివేముల ఆనందరావు కంది మండల తహసీల్దారును కోరారు. దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగ, విద్యా అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కంది గ్రామంలోని ఐఐటీ కళాశాలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారికి స్థానిక నివాస, కుల, ఆదాయ ధృవపత్రాలతో పాటు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఐఐటీ ఉద్యోగాల పోరాట సమితి అధ్యక్షుడు కలివేముల ఆనందరావు కంది మండల తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంది ఐఐటీలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చిన పలువురు ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, కొందరు స్థానిక నివాస, కుల, ఆదాయ ధృవపత్రాలు పొందడంతో పాటు ఓటర్ గుర్తింపు కార్డులు కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దీనివల్ల కంది మండలం, సంగారెడ్డి జిల్లా స్థానిక యువతకు లభించాల్సిన ఉద్యోగ అవకాశాలు, విద్యా రిజర్వేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ఓటు హక్కు వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఐఐటీలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారికి స్థానిక ధృవపత్రాలు, ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటికే అటువంటి ధృవపత్రాలు లేదా ఓటర్ కార్డులు జారీ చేసి ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఐఐటీలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కనీసం 80 శాతం స్థానిక యువతకు అవకాశం కల్పించేలా కళాశాల యాజమాన్యానికి సూచనలు ఇవ్వాలని తహసీల్దారు వినతిపత్రంలో కోరారు. స్థానిక యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పి.శ్రీనివాసు, హనుమంతు నాయక్, శివకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.












