నిజామాబాద్, జూలై 17
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో ‘ఇందూరు రణభేరి’ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’ నిరసన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత ఏడాది ప్రైవేట్ కళాశాలల బంద్ అనంతరం కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసి, ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు బీజేపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, నిజామాబాద్ నుంచి ప్రారంభమైన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు.












