కామారెడ్డికి చెందిన మున్నం అనన్య, ఇంటర్మీడియట్ CEC గ్రూప్ లో 1000 మార్కులకు 982 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంక్ ను గెలుచుకుంది. ఇది ఆమెకు రెండవ సారి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం కావడం విశేషం.
VRK కళాశాల విద్యార్థిని అయిన అనన్య, ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో CEC గ్రూప్ లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 982 మార్కులతో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిన అనన్య, భవిష్యత్తులో IAS అధికారి కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపింది.
గతంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో కూడా అనన్య రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించింది. తన కుమార్తె విద్యా ప్రస్థానంలో సాధిస్తున్న విజయాలపై తల్లిదండ్రులు మున్నం శ్రవణ్ కుమార్ (సీనియర్ జర్నలిస్ట్), మున్నం రాధ ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె లక్ష్య సాధనకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
అనన్య అక్క నిహారిక కూడా విద్యారంగంలో రాణిస్తూ, B.Tech ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇద్దరు కుమార్తెల విద్యా విజయాలు తమకు ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం కూడా అనన్య ప్రతిభను అభినందించింది.











