సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సహాని సందర్శించి, విద్యార్థుల సమస్యలు, కళాశాల వసతులపై ఆరా తీశారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సహాని మంగళవారం సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కళాశాల కల్పిస్తున్న వసతులను, విద్యార్థిని విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తారా కళాశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో సాధించిన అభ్యున్నతిని తెలుసుకొని ఆమె ప్రశంసించారు. తంజావూర్ పెయింటింగ్ వంటి విభిన్నమైన సర్టిఫికేట్ కోర్సులను కళాశాల నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, అత్యవసర వైద్య సదుపాయాల గురించి కమిషన్ సభ్యురాలు ఆరా తీశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కమిషన్ తరపున కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
విద్యార్థులకు మానవ హక్కులకు సంబంధించి అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.












