పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, వ్యక్తిత్వ వికాసమే విజయానికి పునాది అని యస్.బి.ఐ.టి. కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ అన్నారు. కళాశాల ఆవరణలో జరిగిన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రపంచ గతిని మార్చగల శక్తి తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని, నేటి యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత అలవాట్లలో మార్పులు, క్రమశిక్షణ ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “క్లాస్రూమ్ టు బోర్డ్‌రూమ్” అనే అంశంపై ఆయన విద్యార్థులకు జీవిత విలువలు, వ్యక్తిగత క్రమశిక్షణపై అవగాహన కల్పించారు. తరగతి గదులు జ్ఞానాన్ని అందిస్తే, ప్రపంచం ఆ జ్ఞానానికి పరీక్ష పెడుతుందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు.
విద్యా వ్యవస్థ కేవలం పరీక్షలు, గ్రేడులు, డిగ్రీలకే పరిమితం కాకుండా, సవాళ్లను ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని కూడా అందించాలని కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ, బోర్డ్‌రూమ్ అనేది కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్రమని, అక్కడ తీసుకునే తప్పు నిర్ణయాలు వ్యవస్థలపై, ఉద్యోగులపై, కుటుంబాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తరగతి గది, బోర్డ్‌రూమ్ మధ్య టీమ్‌వర్క్ అనే సామాన్యత ఉందని, విద్యార్థులు భవిష్యత్తులో సమిష్టి పనితీరును అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.

