కామారెడ్డి, జులై 05
మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో, ఒక పోలీస్ కానిస్టేబుల్ తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశమైంది.
ఖరీదైన ప్రైవేట్ స్కూల్ బ్యాగులు, రంగురంగుల టైలు, కాన్వెంట్ చదువుల వెనుక మధ్యతరగతి తల్లిదండ్రులు పరుగులు తీస్తున్న రోజులివి. పిల్లల చదువుల కోసం రెక్కల ముక్కలు చేసుకుంటూ, ప్రైవేట్ సంస్థల ఫీజుల భారాన్ని మోస్తూ సగటు మనిషి సతమతమవుతున్న తరుణంలో... ఓ పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సమాజంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ వ్యవస్థపై, సర్కారు బడిపై నమ్మకంతో ఆయన వేసిన అడుగు వందలాది మంది తల్లిదండ్రులకు కళ్ళు తెరిపించేలా ఉంది.
ఆయనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బక్కనోల్ల రవి (స్వగ్రామం కరడపల్లి).
సమాజంలో శాంతిభద్రతలను కాపాడే రక్షకభటుడిగా ఉన్న రవి, తన కుమారుడు బక్కనోల్ల పృథ్విక్ను ఏ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనో చేర్పించలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలు, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధనపై పూర్తి విశ్వాసం ఉంచారు. తన కుమారుడిని కృష్ణాజివాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించి నిజమైన 'ఆదర్శాన్న' చాటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా, తన బిడ్డను ప్రభుత్వ బడికే పంపడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను ఆయన పటాపంచలు చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రామస్వామి కానిస్టేబుల్ రవిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో విశ్వాసాన్ని మరింత పెంచేలా కానిస్టేబుల్ రవి తీసుకున్న నిర్ణయం అత్యంత అభినందనీయం. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నంత ఉన్నత విద్యా అర్హతలు, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థల్లో దొరకరు. ఇక్కడ నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన సౌకర్యం ఉన్నాయి."
అంతేకాకుండా, తల్లిదండ్రులందరూ ప్రైవేట్ ఫీజుల భారం నుంచి బయటపడి, కానిస్టేబుల్ రవి చూపిన మార్గంలో నడవాలని, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎంఈఓ పిలుపునిచ్చారు.
మన చుట్టూ ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కేవలం రంగురంగుల బిల్డింగులతో, డొల్ల చదువులతో లక్షల రూపాయల ఫీజులను గుంజుతున్నాయి. కానీ ప్రభుత్వ బడుల్లో ఉచితంగా, అత్యంత అనుభవజ్ఞులైన గురువుల పర్యవేక్షణలో విద్య అందుతోంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ తన బిడ్డను ప్రభుత్వ బడికి పంపి భరోసా ఇస్తున్నప్పుడు, సామాన్య తల్లిదండ్రులం మనం ఎందుకు వెనుకడుగు వేయాలి? ఆడంబరాలకు పోయి అప్పులపాలు కాకుండా... నాణ్యమైన చదువును, నమ్మకమైన భవిష్యత్తును ఇచ్చే మన ఊరి ప్రభుత్వ బడి వైపు అడుగులు వేద్దాం. కానిస్టేబుల్ రవి నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం!












