ప్రభుత్వ విద్య, ముఖ్యంగా ప్రాథమిక విద్యను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (PTA TG) అధ్యక్షులు కె. మల్లికార్జున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర విద్యా సలహాదారు కే. కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిల ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యపై కుట్ర జరుగుతోందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వ విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని PTA TG అధ్యక్షులు కె. మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.
భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలను తగ్గించేలా, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టేలా ప్రణాళికలు జరుగుతున్నాయని, మార్కెట్ రేటు ప్రకారం జీతాలు ఉంటాయని విద్యా కమిషన్ చైర్మన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్లు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఇది నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలను తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఐటీ, మార్కెటింగ్, ఏఐ వంటి రంగాల ప్రభావం, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాల వల్ల ఉన్నత, మధ్యతరగతి వర్గాల వారు ఉపాధ్యాయ వృత్తి వైపు తక్కువగా వస్తున్నారని, ఈ నేపథ్యంలో పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత ఉపాధ్యాయ వృత్తిలోకి రాకుండా చేయడం ద్వారా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
DIET, TTC వంటి సంస్థలను ఎత్తివేయడం, డిగ్రీ, బీఈడీ చదివిన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం వంటి చర్యలు పేద, వెనుకబడిన వర్గాల యువతకు ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయని, ఈ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, నాయకులు ప్రభుత్వ విద్యను కాపాడుకునే దిశగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

