వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రైవేట్ స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (AISB) ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టీఏ అధికారులు బస్సుల ఫిట్నెస్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రమాదకరమైన బస్సులను రోడ్లపైకి అనుమతించరాదని కోరింది.
పాఠశాలలు తిరిగి తెరవడానికి కొద్ది రోజులే సమయం ఉన్నందున, ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఏ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని AISB ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ కోరారు. చాలా కాలంగా నిలిచిపోయిన బస్సులు, 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రమాదాలకు కారణం కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రవాణా శాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాలతో సమావేశమై, బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా నిర్వహించుకోవాలని అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఆయన ఆర్టీఏ అధికారులను కోరారు. పసుపు రంగు, పాఠశాల వివరాలు, ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించడం వంటి నిబంధనలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.
డ్రైవర్లకు కనీసం ఐదేళ్ల సీనియారిటీ, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని, వారి వివరాలు అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. క్లీనర్లుగా కొత్తవారిని నియమించరాదని, బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, శానిటైజర్, ఎమర్జెన్సీ డోర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు.
డ్రైవర్ ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో పాటు, వాహనానికి సంబంధించిన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తక్షణమే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.










