రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణను యువతీయువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో ఆర్ సెటీ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లోని శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రం, వసతి గదులను పరిశీలించారు. మగ్గం వర్క్ శిక్షణ పొందిన అభ్యర్థులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించి, వారి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్ సెటీ కేంద్రాలు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి రావడం యువతకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇక్కడ అందించే ఉచిత వసతి, భోజనం, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిక్షణలో నేర్చుకున్న మెళకువలను స్వయం ఉపాధిలో వినియోగించుకొని ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించాలని, ఏడాది పొడవునా శిక్షణ అందించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, యూబీఐ డీజీఏం నటరాజ్, ఏజీఎం శ్రీనివాసరావు, ఎల్ డీ ఎం మల్లికార్జున రావు, శిక్షణా కేంద్రం బాధ్యులు, బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











