శ్రీ భాషిత పాఠశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్రంథాలయం మరియు సైన్స్ ప్రయోగశాలను జిల్లా సైన్స్ అధికారి కస్తూరి గంగా కిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని విద్యా సదుపాయాలను పరిశీలించి, యాజమాన్యాన్ని అభినందించారు.
జిల్లా సైన్స్ అధికారి కస్తూరి గంగా కిషన్ శ్రీ భాషిత పాఠశాలలో నూతనంగా నెలకొల్పిన సైన్స్ ప్రయోగశాల మరియు గ్రంథాలయాన్ని సందర్శించారు. సైన్స్ ల్యాబ్‌లోని ఆధునిక పరికరాలను, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలకు సంబంధించిన ఉపకరణాలను ఆయన నిశితంగా పరిశీలించారు.
పాఠశాల గ్రంథాలయంలో అన్ని తరగతుల విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటం ఆయనను ఆకట్టుకుంది. పాఠ్యపుస్తకాలతో పాటు సైన్స్, జనరల్ నాలెడ్జ్, మనోవికాస, నైతిక విలువలపై పుస్తకాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులలో పరిశోధన భావం, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడానికి ఇటువంటి సదుపాయాలు అత్యంత కీలకమని జిల్లా సైన్స్ అధికారి పేర్కొన్నారు. తల్లిదండ్రులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాల చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుభవాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర పాఠశాలల విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కూడా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










